మన నటీనటులకు ధైర్యం ఎక్కువయ్యిందీ మధ్య. అందుకే ప్రయోగాలు చేయడానికి వెనుకాడటం లేదు. డిఫరెంట్ సినిమాలు చేయడానికి బాగా మొగ్గు చూపుతున్న మన హీరోలు, తమ నటనలో డిఫరెన్స్ చూపటం కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. రుద్రమదేవి, బాహుబలి చిత్రాల కోసం ప్రభాస్, రానాలు కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీలు చేస్తూ చెమటలు ధారపోస్తున్నారు. నేర్చుకోవడం తప్పదు. మంచిది కూడా. కానీ కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల గుర్రపుస్వారీ చేస్తోన్న రానా గుర్రం మీద నుంచి పడిపోయాడు. దెబ్బలు తగిలితే కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదమేమీ లేదు కానీ, కాస్త దెబ్బలైతే తగిలాయి.
ఆ మధ్య రుద్రమదేవి కోసం కత్తియుద్ధం ప్రాక్టీస్ చేస్తోన్న బాబా సెహగల్ కు కూడా ప్రమాదం జరిగింది. నిన్నటికి నిన్న, ఫారిన్ లో జరుగుతోన్న షూటింగ్ లో మోహన్ బాబు సముద్రంలో పడిపోయారు. తృటిలో ప్రమాదం తప్పింది. ఇలాంటి ఫీట్లు చేస్తున్నప్పుడు నటీనటులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మగవాళ్లే కాదు, నటీమణులు కూడా ఇలాంటివి చేస్తున్నారు. అనుష్క, శ్రియలు కూడా మల్లయుద్ధాలు, కత్తియుద్ధాలు ప్రాక్టీస్ చేయక తప్పని పరిస్థితి. ప్రమాదాలనేవి జరగుతూ ఉంటాయి. వాటిని ఊహించలేం. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే, వాళ్లను నమ్ముకుని నిర్మాతలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. ప్రమాదాలు జరిగి, గాయాలంటూ మంచమెక్కితే నష్టం మామూలుగా ఉండదు. కాబట్టి నటీనటులూ... కాస్త జాగ్రత్త!