విడుదల తేదీ : 28 జూన్ 2013 |
రేటింగ్ : 1.5/5 |
దర్శకుడు : ఎం.జె. రెడ్డి |
నిర్మాత : ఎస్.వి. రావు |
సంగీతం : సందీప్ |
నటీనటులు : రాజా, నిషా … |
రాజా, నిషా జంటగా నటించిన సినిమా ‘ఓ మై లవ్’. ఈ సినిమా ఈ రోజు రాష్ట్రమంతటా విడుదలైంది. ఎం.జె. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని సందిని ఫిలింస్ బ్యానర్ పై ఎస్.వి. రావు నిర్మించారు. ఈ సినిమాకి సందీప్ సంగీతాన్ని అందించాడు.ఆశిష్ విద్యార్థి, సుమన్ శెట్టి తదితరులు ఈ సినిమాలో నటించారు. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
సంతోష్(రాజా) చదువు కోవడం కోసం సిటీకి వస్తాడు. తను తన ఫ్రెండ్స్ కి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ వుంటాడు. ఇలా ఒక ఫ్రెండ్ కు సహాయం చేస్తున్నపుడు వల్లి(నిషా) పరిచయం అవుతుంది. దానితో సంతోష్ వల్లిని ప్రేమిస్తాడు. అలాగే మరో ఫ్రెండ్ కి సహాయం కోసం శంకరన్న (ఆశిష్ విద్యార్థి) అనే రౌడి ఇంటికి వెళ్తాడు. అక్కడ వల్లిని చూస్తాడు. అక్కడ జరిగింది తెలుసుకొని తనని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. ఇంతలో శంకరన్న పై శత్రువులు అటాక్ చేస్తారు. తను తీవ్రంగా గాయ పడతాడు. హీరో అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తువుంటాడు. ఇంతలో వల్లి సంతోష్ ను చంపాలనుకుంటుంది.
అసలు వల్లి సంతోష్ ను ఎందుకు చంపాలనుకుంది? శంకరన్నను ఎవరు, ఎందుకు చంపాలనుకున్నారు? వల్లికి శంకరన్నకు సంబంధం ఏమిటి ? అసలు ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
రాజా చూడటానికి బాగున్నాడు, నటన పరంగా పరవాలేదనిపించాడు. హోమ్లీ గర్ల్ లుక్ లో నిషా ఓకే. మెయిన్ విలన్ శంకరన్న పాత్ర పోషించిన ఆశిష్ విద్యార్థి నటన బాగుంది. అలాగే కొంతమంది సీనియర్ నటులు బాగా నటించారు. కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా చూపించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ మూవీకి మొదటి మైనస్ కథ. చాలా రొటీన్ కథ. ఈ సినిమాని చూస్తుంటే జరగబోయే సీన్ టు సీన్ మనకు ముందుగానే తెలిసిపోతుండడంతో పెద్ద కిక్ ఏమీ ఉండదు. సినిమా మొదటి నుంచి చివరి దాకా చాలా స్లోగా సాగుతుంది. ఇలాంటి కథలు నా చిన్నప్పటి నుంచి తీస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం, దీనికి స్క్రీన్ ప్లే కూడా సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు పరమ బోర్ ఫీలవుతున్నారు. ఏదో కమ్ర్శోయాల్ హంగులు ఉండాలి అనే ఉద్దేశంతో సినిమాలో పెట్టిన ఫైట్స్, హీరో వేసిన డాన్స్ లు చూస్తుంటే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. లవ్ స్త్రోయ్ లో ఉండాల్సిన పర్ఫెక్ట్ రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాలోలేక పోవడం కాస్త శోచనీయం ఎందుకంటే టైటిల్ లో మై లవ్ అని పెట్టుకొని లవ్వే లేకపోతే ఏడుపు కాక ఇంకేమొస్తది.
ఓ ప్రకటనలో చెప్పినట్టు దీనిలో రంగు రుచి చిక్కదనం ఏమీ లేవు అన్నట్టు ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ లాంటివి ఏమీ లేవు. సినిమాలో సందర్భం లేకుండా వెంట వెంటనే వచ్చే పాటలు ప్రేక్షకునికి చిరాకు తెప్పిస్తాయి.
సాంకేతిక విభాగం :
ఎం.జె.రెడ్డి దర్శకత్వం చెప్పుకునే రేంజ్ లో లేదు ఏదో ఉందంటే ఉంది. డైరెక్టర్ కాస్త కామెడీ, సెంటిమెంట్, లవ్ ట్రాక్ మీద శ్రద్ధ పెట్టి వుంటే బాగుండేది. ఇది వరకే చెప్పినట్టు కథ, స్క్రీన్ ప్లే చాలా చెత్తగా ఉన్నాయి. సందీప్ అందించిన సంగీతం కూడా బాగోలేదు. అన్ని పాటలు ఒకేలా ఉంటాయి. ఎడిటర్ అన్నా కాస్త శ్రద్ధ తీసుకొని కాస్త సినిమాకి కత్తిరింపులు వేసుంటే చాలా బాగుండేది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. డైలాగ్స్ లో కూడా కొత్తదనమేమీ లేదు, అలాగే అన్ని డైలాగ్స్ ఎక్కడో విన్నట్టు ఉంటాయి. నిర్మాణ విలువలు ఓకే.
తీర్పు:
‘ఓ మై లవ్’ – లవ్ తక్కువ గొడవలు ఎక్కువగా సాగే సినిమా. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమి లేదు. అన్నిసినిమాల్లాగా ఇది కూడా ఒక పరమ రొటీన్ లవ్ స్టోరీ మాత్రమే. చాలా రోజుల తరువాత రాజా హీరోగా వచ్చిన సినిమా ఇది. తను మంచి కథను ఎంచుకొని వుంటే బాగుండేది. నా అబిప్రాయం ప్రకారం ఈ సినిమా చూడకుండా ఉండటమే మంచింది.
రేటింగ్ : 1.5 / 5